అక్షరటుడే, నిజామాబాద్: నగర బీఅర్ఎస్ ప్రజాప్రతినిధులు, యువ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ప్రస్తుత కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు, యువజన విభాగం నాయకులు ఉన్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు ప్రధాన అనుచరులుగా వ్యవహరించిన వారిలో అయిదారుగురు నేతలు తాజాగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడితో మంతనాలు జరిపారు. షబ్బీర్ అలీ సైతం పచ్చజెండా ఊపడంతో వీరంతా అతి త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
అదే ప్రధాన కారణమా!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళిత బంధు పేరిట డబ్బులు వసూలు చేసిన పలువురు బీఆర్ఎస్ యువ నేతలు ఆ మొత్తాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే సోదరుడిగా చెప్పుకుని తిరిగే వ్యక్తికి అప్పగించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అంతా తలకిందులైంది. ముఖ్యంగా దరఖాస్తుదారులు తమ డబ్బుల కోసం బీఆర్ఎస్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే సోదరుడి నుంచి డబ్బులు తిరిగి రాబట్టలేక విసుగు చెందిన నాయకులందరూ గంపగుత్తగా పార్టీ వీడుతున్నట్ల తెలుస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గూటికి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భావించి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. దాదాపు రూ.2 కోట్లకు పైగా దళిత బంధు పేరిట ముందస్తు వసూళ్లు చేశారు. దరఖాస్తుదారులకు పథకం రాలేదు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. మరి బాధితులకు ఎవరు, ఎలా న్యాయం చేస్తారో వేచి చూడాలి.!