అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందగా.. మృతుని కుటుంబీకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. చనిపోయిన తర్వాత కూడా లక్షల్లో బిల్లు చెల్లిస్తేనే.. డెడ్ బాడీని అప్పగిస్తామని యాజమాన్యం చెప్పినట్లు వారు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన నయూమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. చికిత్స నిమిత్తం యెండల టవర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు గాయాలు అయ్యాయని చెప్పిన వైద్యులు సర్జరీ చేశారు. గురువారం రోగి మృతి చెందాడు. అప్పటికే మృతుని కుటుంబీకులు లక్షల్లో బిల్లు చెల్లించారు. అయినప్పటికీ.. మరో రూ.2 లక్షలు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామని ఆస్పత్రి సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో మృతుని కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు దిగివచ్చిన యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించింది. ఈ ఆస్పత్రిలో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ పేరు చెప్పి ప్రతీ రోగికి లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. ఇటీవల ఓ రోగికి రూ.25 లక్షలు బిల్లు వేసిన ఉదంతం బయటపడింది. గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు నేతలు సహకారం అందించారు. నేతలు అధికారం కోల్పోయి ప్రభుత్వం మారినా వీరి దోపిడీ మాత్రం ఆగట్లేదు. ఇద్దరు అంబులెన్సుల డ్రైవర్ల ద్వారా ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఏ రోగి పరిస్థితి విషమించి బయటకు వెళ్లినా మొదట ఇదే ఆస్పత్రికి తీసుకువచ్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆస్పత్రి ఆగడాలపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఆస్పత్రి తీరుతో ఇతర ఆస్పత్రుల వైద్యులు సైతం గుర్రుగా ఉన్నట్లు వినికిడి. మరోవైపు అధిక బిల్లుల వసూళ్లపై ఐఎంఏ మౌనం వహించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.