అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదుట రైతులు గురువారం ఆందోళన చేశారు. బ్యాంకులోని ఖాతాదారుల నుంచి వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసినట్లు బాధితులు ఆరోపించారు. పంట రుణాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించిన వారికి రుణాలు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాంక్ సిబ్బంది తీరుపట్ల ఆందోళన గురైన రైతులు బ్యాంక్ మేనేజర్ తో పాటు సిబ్బందిని నిలదీశారు . ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పోల్కంపేట గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య అనే వ్యక్తి గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాగా.. మూడు రోజుల క్రితం కిష్టయ్య ఖాతా నుంచి రూ.4,900 ఇతరులు డ్రా చేశారని, తలారి కిష్టయ్యకు గత మార్చి మూడో తేదీన పంట రుణం బకాయి లేనట్టు ఎన్వోసీ ధ్రువీకరణ పత్రాన్ని బ్యాంక్ అధికారులు జారీ చేశారని వివారించారు. మండలంలోని పలు గ్రామాల రైతులకు రుణమాఫీ వర్తించినప్పటికీ.. వారికి ఖాతాలలో నగదు జమ చేయకుండా నిర్లక్ష్యం వహించినట్లు రైతులు ఆరోపించారు. కొత్త వ్యవసాయ రుణాల కోసం బ్యాంకు చుట్టూ నెలల తరబడి తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. దళారులను ఆశ్రయించిన వారికి ఒక్కరోజులోనే రుణం మంజూరు చేస్తున్నారని బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రైతులు ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు తీరుపై రైతులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజినల్ మేనేజర్, లీడ్ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.