ఆ పార్టీల్లో చేరేందుకు చైర్ పర్సన్ చేసిన ప్రయత్నాలు విఫలం
పదవి గండం ఖాయమేనా..?
అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతకు చుక్కెదురు అయినట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ పండిత్ వినీతతో పాటు ఆమె భర్త పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ ఓ ప్రధాన పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చైర్ పర్సన్ పదవిపై వారు ఆశలు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వినీతపై సొంత పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు 22 మంది అవిశ్వాస తీర్మానం విషయమై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును కలిశారు. అన్నింటిని పరిశీలించిన కలెక్టర్ అవిశ్వాస పరీక్ష జరిపేందుకు వీలుగా జనవరి 4న మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు.
క్యాంపు రాజకీయాలు..
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో 22 మంది బీఅర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ పాటికే కౌన్సిలర్స్ రెండు గ్రూపులుగా విడిపోయి క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. ప్రస్తుతం అవిశ్వాసం ప్రవేశపెట్టిన వర్గం వైపు 22 మంది ఉన్నారు. చైర్ పర్సన్ వినీత వైపు కేవలం 8 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
పదవి గండం ఖాయమేనా..?
చైర్ పర్సన్ వినీతపై అవిశ్వాస తీర్మానం కోసం సొంత పార్టీ కౌన్సిలర్లే ప్రయత్నాలు చేయడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వినీత భర్త పండిత్ పవన్ సోదరుడు ప్రేమ్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఇదివరకు ప్రధాన అనుచరుడు. కాగా.. సొదరులిద్దరు కలిసి జీవన్ రెడ్డి పేరు చెప్పుకొని మున్సిపాలిటిలో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని ప్రచారంలో ఉంది. వీరిద్దరే ఇన్నాళ్లు మున్సిపల్ లో అంతా నడిపించారు. వెంచర్లు, మున్సిపల్ లోని 10 శాతం స్థలాల కబ్జాలు వీరి కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. అడ్డగోలుగా ఇంటి నంబర్లను జారీ చేయించారని సొంత పార్టీ నేతలు గతంలో ఆరోపించారు. ఇదే చివరకు సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచి అసమ్మతికి కారణమైంది. జీవన్ రెడ్డి మద్దతు కూడా లేకపోవడంతో పదవి గండం ఖాయమని తెలుస్తోంది.