అక్షరటుడే, ఇందూరు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆమె హయాంలో ఎన్నో పనులు జరిగాయని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ తన నిధులు రూ.25 కోట్లు ఉంటే.. కనీసం రూ.5 కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కవిత మరోసారి ఎంపీ అయితేనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు చామకూర ప్రభాకర్‌రెడ్డి, సుజీత్‌సింగ్ ఠాకూర్, ఎనగందుల మురళి, కరిపె రాజు పాల్గొన్నారు.
సర్వత్రా చర్చ!
ఎమ్మెల్సీ కవిత గురించి తెలియని వారుండరు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. జిల్లా పార్టీలోనూ ఆమె తర్వాతే అందరూ. సొంతంగా ఇతరులకు టికెట్ ఇప్పించే సత్తా కలిగిన కవిత కోసం.. నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ డిమాండ్ చేయడంపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కవిత తాజాగా మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రత్యేకించి అర్బన్ లో బీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది.