అక్షరటుడే, నిజామాబాద్: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలకు ఎలాంటి గ్యారెంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజల కోసం చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందన్నారు. తాజాగా తబ్లిక్ హి జమాతేకి రాష్ట్ర ఖజానా నుంచి నిధులు కేటాయించడం సరి కాదన్నారు. తాను తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉంటానని, భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. మంగళవారం నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో ప్రయోగించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ విజయం అయ్యిందని.. రానున్న ఎన్నికల్లో అన్ని వర్గాల వారు ఈ విధానానికి అండగా నిలవాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలకు మించదని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పని చేశానని, జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అవినీతికి తావులేకుండా పని చేస్తారని చెప్పారు. పసుపు బోర్డు సైతం త్వరలో ఏర్పాటు కాబోతుందని, త్వరలోనే క్వింటాకు రూ.20 వేలు ఇప్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య, రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.