అక్షరటుడే, ఇందూరు: నెలాఖరులోపు రైతులందరి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రెండెకరాల్లో భూమి ఉన్న 29 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని, మిగతా రైతుల ఖాతాల్లో రేపటి నుంచి వేస్తామని పేర్కొన్నారు. బుధవారం నందిపేట మండలం ఆంధ్రానగర్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశదిశలా చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశీస్సులతోనే తామంతా రాజకీయాల్లోకి వచ్చామని పేర్కొన్నారు. అంతకుముందు డిచ్‌పల్లిలో మంత్రి తుమ్మలకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ, మాజీ ఎమ్మెల్సీ అరికెల, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.