భవిష్యత్తులో పసుపునకు రూ.20 వేలు ధర

0

అక్షరటుడే, ఇందూరు: పసుపు సాగులో రసాయనాల వాడకం తగ్గించి ఆర్గానిక్‌గా పండిస్తే భవిష్యత్తులో క్వింటాలుకు రూ.20వేలకు పైగానే ధర పలుకుతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పసుపు ట్రేడర్స్‌, కమీషన్‌ ఏజెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గతవారం కొత్త పసుపునకు ధర రూ.10వేలు, ఎండిన వాటికి రూ.13వేలు పలికిందన్నారు. రైతులు తొందర పడొద్దని.. కొమ్ములను ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అతివృష్టి, అనావృష్టి ఏది జరిగినా.. పరిహారం అందాలంటే కేంద్రం అందిస్తున్న ఫసల్‌ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతుల కోసం పాటుపడా లన్నారు. అలాగే పసుపునకు సంబంధించి చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ట్రేడర్స్‌ ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో అవినీతిరహిత బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నారని.. పరిశ్రమలు పెట్టుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. తెలంగాణలో అతిపెద్ద మార్కెట్‌ యార్డు నిజామాబాద్‌ అని, సుమారు రూ.40 కోట్ల నిధులున్నా.. సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, భూపతిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లాబిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.