అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని జెండాగల్లిలో గల ఓ బంగారం దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. యజమానిపై మత్తుమందు చల్లి బంగారు ఆభరణాలను దోచుకెళ్ళారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి బంగారం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు నమ్మించి యజమానితో మాటలు కలిపాడు. అనంతరం కళ్లల్లో పౌడర్ చల్లడంతో 10 నిమిషాల పాటు దుకాణ యజమాని అపస్మారకస్థితిలో వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దుండగుడు సుమారు 12 తులాల ఆభరణాలు దోచుకెళ్లాడు. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.