అక్షరటుడే, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్ర శాసనసభ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదైంది. బాన్సువాడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ క్యాంపు కార్యాలయానికి మంగళవారం రాత్రి భాస్కర్ రెడ్డి వెళ్లి డ్రైవర్ పైన దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని నిరసిస్తూ యెండల బుధవారం మౌన దీక్ష చేపట్టారు. చివరకు భాస్కర్ రెడ్డితో పాటు బాలకృష్ణ, ప్రమోద్ రెడ్డి, వినోద్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.