అక్షరటుడే, హైదరాబాద్: Telangana Assembly : రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను నేడు శాసనసభలో సర్కారు ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి సంబంధించిన ఈ బిల్లులకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు నేడు శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ, మండలిలో సోమ, మంగళవారాల్లో ప్రత్యేక చర్చకు అవకాశం కల్పిస్తారు.
Telangana Assembly : ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాతం
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల సర్వే(socio-economic caste survey) నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతోపాటు కులాలవారీగా జనాభా లెక్కలను సర్కారు వెల్లడించింది. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25, ముస్లింలకు బీసీ-ఈ(Muslims under BC-E) కింద 4 శాతం ఉంది. బీసీలకు 42 శాతానికి రిజర్వేషన్లు పెంచేందుకు బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు అసెంబ్లీ హాల్లో(Assembly Hall) ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Telangana Assembly : ఎస్సీ వర్గీకరణకు అంతా సిద్ధం
ఎస్సీ వర్గీకరణ(SC classification)పై సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పునిచ్చిన సమయంలోనే రాష్ట్రంలోనూ వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్(Minister Uttam) ఆధ్వర్యంలో ఉపసంఘం(sub-committee) ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సర్కారు జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఫిబ్రవరిలో నివేదిక సమర్పించింది. ఇందులో ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని కమిటీ పేర్కొంది. ఈ వివరాలను అప్పుడే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్ను సర్కారు మరోసారి కోరాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని, తాజాగా ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తోంది.