అక్షరటుడే, జుక్కల్ : సమగ్ర కుటుంబ సర్వే కులాల జాబితాలో తమ కులం పేరు లేదంటూ పెద్దకొడప్గల్ మండలంలో 2000 మధుర లంబాడ కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి. విషయం తెలుసుకొని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం సాయంత్రం మండలంలోని పెద్ద దేవి సింగ్ తండాకు వెళ్లి తండావాసులతో చర్చించి సర్వేకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు ఒప్పుకోలేదు. జాబితాలో 240 కులాల పేర్లు ఉన్నప్పటికీ తమ కులం పేరు మధుర అని ఉందని అది సరికాదని తమ కులం పేరు మధుర లంబాడా, కాగిత లంబాడా, లబానా లంబాడగా ఉండాలన్నారు. ఇలా లేని కారణంగా సర్వేలో పాల్గొనమని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని వారికి తెలిపినప్పటికీ ఒప్పుకోలేదు. దీంతో మండలంలోని టీకారాం తండా, కుబేర నాయక్ తండా, చావుని తండా పోచారం, జగన్నాథపల్లి, రాములు నాయక్ తండా, అంజని, కొడప్గల్, సమందర్ తండా, ధర్మపురి తండా పరిధిలో సర్వే నిలిచిపోయింది.