300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

0

అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓ లారీలో బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండ్రోజుల కిందట తనిఖీలు జరిపారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్ సమీపంలో ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 308 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ధర్మాబాద్ కు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు. అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. క్వింటాల్ బియ్యాన్ని పట్టుకుంటే హడావుడి చేసే సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

ఆ మిల్లర్లదేనా..!

జిల్లాలో పీడీఎస్ దందాకు ఏమాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఒకవైపు తనిఖీలు చేస్తున్నా.. మరోవైపు క్వింటాళ్ల కొద్ది పీడీఎస్ నిల్వలు పట్టుబడుతున్నాయి. వర్ని, కోటగిరి, బోధన్ కేంద్రంగా నడుస్తున్న మిల్లుల నిర్వాహకులు బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తాజాగా పట్టుబడిన బియ్యం కూడా హైదరాబాద్ నుంచి నేరుగా కోటగిరిలోని ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఓ మిల్లర్ కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. గతంలో సీఎంఆర్ కోటాను పక్కదారి పట్టించిన మిల్లర్లు ఆ లోటును పూడ్చుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించినా మార్పు రావట్లేదు.