అక్షరటుడే, వెబ్‌డెస్క్ Indiramma Houses : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లు అందించే కార్యక్రమం వచ్చే వారం ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో కొన్నింటిని నెరవేర్చామని, మిగిలిన వాటిని త్వరలో నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తులం బంగారం ఆలస్యం అవుతుందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అన్నింటినీ పక్కనపెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
Indiramma Houses : అర్హుల ఎంపికకు రీవెరిఫికేషన్
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో అధికారులు రీవెరిఫికేషన్ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేశారు.
దరఖాస్తుదారులను ఎల్-1 (సొంత స్థలాలు ఉన్నవారు), ఎల్-2 (సొంత స్థలం కాని, ఇల్లు కాని లేని వారు), ఎల్-3 (ఇతరులు) అని మూడు జాబితాలుగా ప్రభుత్వం విభజించింది. ఇప్పుడు ఎల్-1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72 వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫెకేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో అతి పేదలను మొదటగా గుర్తించి ఆర్థిక సాయం అందించనున్నారు.