
అక్షరటుడే, వెబ్డెస్క్: 8th Pay Commission | కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ ఎంత పెరుగుతుందనే దానిపై చర్చ జరుపుతున్నారు. అయితే 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే జీతాలు, డీఏ ఎంత పెరుగుతుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. అదే సమయంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా మారనుంది. గతంలో వివిధ వేతన సంఘాలు అమలైనప్పుడు జీతం ఎంత శాతం పెరిగిందో చూస్తే.. 1959లో 2వ వేతన సంఘంలో 14.20 శాతం పెంచాలని ప్రతిపాదించగా 1973లో 3వ వేతన సంఘం సమయంలో అది 20.60 శాతమైంది. 1986లో 4వ వేతన సంఘం సమయంలో 27.60 శాతంగా, 1996లో 5వ వేతన సంఘం సమయంలో 31 శాతంగా ప్రతిపాదించారు.
8th Pay Commission కీలకం అదే..
ఇక 2006లో 6వ వేతన సంఘం సమయంలో 54 శాతం కాగా 2016లో 7వ వేతన సంఘం సమయంలో 14.27 శాతంగా నిర్ణయించారు. అంటే సరాసరి 27 శాతంగా ఉంది. 2006లో ఏర్పాటైనా 6వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86 కాగా, 2016లో 7వ వేతన సంఘంలో 2.57 శాతం ఉంది. ఇక 2026 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉండవచ్చని అంచనా. అంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే సమయానికి డీఏ 62 శాతం ఉంటే జీతం 24 శాతం పెరగవచ్చు. అదే 60 శాతానికి చేరుకుంటే 12 శాతం పెంపు ఉంటుంది. 61 శాతం ఉంటే మాత్రం 18 శాతం పెరుగుతుంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90 ఉంటే కనీస వేతనం రూ.50 వేలు ఉన్నవారికి జీతం రూ.95 వేలు అవుతుంది.
దాదాపు 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుంచి అమల్లోకి రావచ్చు. కొత్త వేతన సంఘం ఉద్యోగుల ఆర్ధిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడి ఉద్యోగులు జీతభత్యాల్ని సమీక్షిస్తూ వస్తున్నారు. 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించిన నేపథ్యంలో కనీస వేతనం రూ.7వేల నుంచి ఒక్కసారిగా రూ.18 వేలకు పెరిగింది. 8వ వేతన సంఘంతో ఏ ఉద్యోగికి జీతం ఎంత పెరుగుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.