అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇందల్వాయి పీఏసీఎస్‌లో నిధుల గోల్‌మాల్‌ అంశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎరువులు, ధాన్యం కొనుగోళ్లు, రైతుల రుణాల్లో సొసైటీ ఛైర్మన్, సీఈవోలు కలిసి రూ.కోటికిపైగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై సొసైటీకి చెందిన 12 మంది డైరెక్టర్లు డీసీవోకు శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. రూ.కోటితో నిర్మిస్తున్న భవనం పనులు, 2022లో వరి కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్‌, ప్రతి సీజన్‌లో 6 వేల గన్ని బ్యాగుల మిస్సింగ్‌ చూపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రతి మీటింగ్‌లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, సొసైటీ లావాదేవీలను డైరెక్టర్లకు వివరించడంలేదని పేర్కొన్నారు. క్రాప్‌ లోన్ల మంజూరులో సహకరించడంలేదని, లావాదేవీల వివరాలు మెయింటెన్‌ చేయడం లేదని వివరించారు. ఈ విషయాలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా చూసేందుకు ఒకరిద్దరు కాంగ్రెస్‌ నేతలు జోక్యం చేసుకుని డైరెక్టర్లతో మాట్లాడినట్లు సమాచారం.