అక్షరటుడే, ఇందూరు: నగరంలో డీఎస్ విగ్రహ ఏర్పాటుకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేసింది. శనివారం ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ జిల్లాకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన చేసిన కృషికి జ్ఞాపకార్థంగా నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ మకరందు పాల్గొన్నారు.