అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బైక్‌ కోసం యువకుడిని హత్య చేసిన కేసులో ఒకరికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక సెషన్స్‌ జడ్జి శ్రీనివాస్‌ సోమవారం తీర్పు వెలువరించారు. ఏపీపీ బంటు వసంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం జాన్సీ లింగపూర్‌కు తుడుం రాకేశ్‌ 2019 ఏప్రిల్‌ 24న రాత్రి తన స్నేహితులతో కలిసి ఊరి చివరన బైక్‌ నిలువుకుని మద్యం తాగాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మహ్మద్‌ ఇమ్రాన్‌ షరీఫ్‌ రాకేశ్‌ బైక్‌ను దొంగిలించాలన్న ఉద్దేశంతో అతన్ని మచ్చిక చేసుకునేందుకు మాట కలిపాడు. మద్యం తాగుదామని అదే బైక్‌పై బలవంతంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులోని అక్కన్నపేట్‌ రైల్వే ట్రాక్‌ వద్దకు తీసుకెళ్లాడు. మరింత మద్యం తాగుదామని రాకేశ్‌ జేబులో నుంచి బైక్‌ కీ తీసే క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. రాకేశ్‌ను చంపాలన్న ఉద్దేశంతో ఇమ్రాన్‌ అక్కడే ఉన్న బండరాయితో రాకేశ్‌ తల, శరీర భాగాలపై బలంగా కొట్టాడు. దీంతో రాకేశ్‌ చనిపోయాడనుకుని నిర్ధారణకు వచ్చి రైలుకింద పడి మృతిచెందాడని భావించేలా మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌ పక్కన పడేసి, బైక్‌తో పాటు మృతుడి జేబులో ఉన్న తీసుకుని పరారయ్యాడు. ఈ మేరకు కోర్టులో నేర నిరూపణ కావడంతో ఇమ్రాన్‌ షరీఫ్‌కు జీవిత కారాగార శిక్ష, దొంగతనం కేసులో మూడేళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.