అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగరానికి తాగునీటిని సరఫరా చేసే అలీసాగర్‌ లిఫ్ట్‌ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. మంగళవారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌ మకరందు పైప్‌లైన్‌ను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే లిఫ్ట్‌లో నీళ్లు ఉన్నాయని.. ఖాళీ కాగానే మరమ్మతులు చేపడతామని అధికారులు ఆయనకు వివరించారు. బుధవారం వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పైప్‌లైన్‌ మరమ్మతులు పూర్తయ్యే వరకు నగరవాసులకు ఇబ్బందులు కలుగకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 17 ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తున్నామని వివరించారు. ఇంకా ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే మున్సిపల్‌ సిబ్బందిని సంప్రదిస్తే ట్యాంకర్ల ద్వారా పంపుతామని చెప్పారు. పైప్‌లైన్‌ పనులు బుధవారం పూర్తయ్యే అవకాశం ఉందని, గురువారం నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా కొనసాగుతుందని కమిషనర్‌ తెలిపారు.