అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లిలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో సుమారు 20 మందికిపైగా వైరల్‌ ఫీవర్లతో మంచంపట్టారు. పలువురు బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే 12 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారని.. వీరిలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ అయ్యిందని, మరొకరి రిపోర్టు రావాల్సి ఉందని నిజాంసాగర్‌ మండల వైద్యాధికారి రోహిత్‌ కుమార్‌ తెలిపారు. గ్రామంలోని ప్రజలు జ్వరాల బారిన పడుతుండడంతో పల్లెవాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.