అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం భారీవర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం కురిసిన వర్షంతో కంఠేశ్వర్‌ కమాన్‌ వద్ద వర్షపు నీరు నిలిచిపోయి ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధారణ జనజీవనానికి ఆటంకాలు కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వర్షపునీరు రహదారుల పైనుంచి ప్రవహించే సమయాల్లో లోలెవెల్‌ వంతెనలు, కాజ్‌ వేలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల మీదుగా రాకపోకలను నిషేధించాలన్నారు. భారీ వర్షాలు కురిసి ఇబ్బందులు ఎదురైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌, ట్రెయినీ కలెక్టర్‌ సంకేత్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.