అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నగర పాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌తో కలిసి బోర్గాం(పి) శివారులోని నాన్‌ లేఅవుట్‌ ప్లాట్లను పరిశీలించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలన్నారు. ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నంబర్లు, ప్లాట్‌ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదని చెప్పారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు ఉన్నారు.