అక్షరటుడే, ఇందూరు: రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. కనీసం సగంమందికి కూడా రుణాలను మాఫీ చేయలేదంటూ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రొటేషన్‌ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల 55 వేల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తే.. కనీసం సగం మందికి కూడా చేయలేదని విమర్శించారు. జిల్లాలో రైతు రుణమాఫీ కేవలం 30 శాతం మాత్రమే జరిగిందని వివరించారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ ఏమయ్యాడో అందరికీ తెలుసునన్నారు. కేసీఆర్‌కి రేవంత్‌కి తేడా లేదని.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారని మండిపడ్డారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్, కవితను బీజేపీ దగ్గరకు రానివ్వదన్నారు. తనకు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారని, అక్కడ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం శనివారం రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానన్నారు. రైతులు, ప్రజలు కూడా మద్దతు తెలిపి రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, పంచ రెడ్డి, ప్రవళిక, శంకర్, నాయకులు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.