అక్షరటుడే, కామారెడ్డి టౌన్: అమృత మహోత్సవంలో భాగంగా కామారెడ్డి పట్టణానికి మంజూరైన రూ.90 లక్షలతో ఎంపిక చేసిన పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్, ప్రజా ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ, జాతీయ రహదారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమృత మహోత్సవంలో భాగంగా పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. అవసరమైతే కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించే లక్ష్యంగా రూ.2.50 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. శానిటరీ అధికారులు శుభ్రత విషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు.