అక్షరటుడే, ఇందూరు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పకడ్బందీగా కలెక్టర్లు పర్యవేక్షణ జరపాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సున్నితత్వంతో కూడుకుని ఉంటాయని, ఏమాత్రం అజాగ్రత్తకు తావివ్వొద్దన్నారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌, ట్రెయినీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, జడ్పీ సీఈవో ఉష, డీపీవో తరుణ్‌ కుమార్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, రాజాగౌడ్‌, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.