అక్షరటుడే, జుక్కల్‌: లెండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు 2025 వరకు సాగునీటిని అందిస్తామని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ సాగుతున్నాయన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌ మండలాల్లోని దాదాపు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుతో చర్చలు జరుపుతోందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు.