అక్షరటుడే, వెబ్‌డెస్క్: రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నదిపై గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు 26 వరద గేట్లను ఎత్తారు. దీంతో దిగువకు గోదావరి ఉరకలేస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 72.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూడడానికి పర్యాటకులు తరలివచ్చారు. మరోవైపు మంజీర నదిలో సైతం వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. సాలూరా అంతర్ రాష్ట్ర సరిహద్దు వద్ద పురాతన వంతెనను తాకుతూ వరద పారుతోంది.