అక్షరటుడే, ఇందూరు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. సోమవారం నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖ రాశారు. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచినందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయట తిరగవద్దని కోరారు. అవసరమైన చోట బీజేపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.