అక్షర టుడే, కామారెడ్డి టౌన్: ఉమ్మడి జిల్లాలో తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రభుత్వం అమృత్ 2.0 కింద రూ.531 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు. వీటిలో నిజామాబాద్ పట్టణంలో తాగునీటికి రూ.270 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ అభివృద్ధికి రూ.168 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, కామారెడ్డి పట్టణంలో రూ.93 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో శాశ్వత డ్రెయినేజీ, తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈమేరకు ఆయన వివరాలు వెల్లడించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.