అక్షరటుడే, జుక్కల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఉదయం నాటికి ప్రాజెక్టు 15 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 27,000 ఇన్ ఫ్లో వస్తోంది. ఎగువన పోచారం, ఘన్ పూర్, హల్దీ వాగు నుంచి నాలుగు రోజుల నుంచి వరద వస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలతో పాటు ఇక యాసంగి పంటలకు ఢోకా లేదని సంతోషంగా ఉన్నారు. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1403.04 అడుగుల (15.03 టీఎంసీలు) నీరునిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మరో 24 గంటల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగితే వరద గేట్ల ద్వారా నీటిని విడుదలను చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తో పాటు ఏఈ శివప్రసాద్ ఎప్పటికప్పుడు ఇన్ ఫ్లో వివరాలు తెలుసుకుంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.