అక్షరటుడే, ఇందూరు: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 22న ప్రతిఇంటా దీపారాధన చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 18న ఖిల్లా రామాలయం, 20న మిగతా అన్ని పురాతన ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 22న ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం శంబుని గుడి చుట్టూ 1500 మంది మహిళలతో దీపారాధన చేపట్టనున్నామని చెప్పారు. ప్రజలు సైతం ఇంటింటా దీపారాధన చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.