అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నగరంలోని వినాయక నగర్‌లో గల బాలికల హాస్టల్, మోపాల్ మండలం కంజర జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవన సముదాయం, డార్మెటరీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. వినాయకనగర్ వసతి గృహానికి చెందిన విద్యార్థినులు బోర్గం(పి) పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, బడి వేళల్లో బస్సు సదుపాయం కల్పించాలని హాస్టల్ నిర్వాహకులు కలెక్టర్‌ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారిణి నిర్మల, సహాయ సంక్షేమ అధికారి భూమయ్య, మోపాల్ ఎంపీడీవో రాములు తదితరులు ఉన్నారు.