అక్షరటుడే, ఆర్మూర్‌: పాఠశాల విద్యార్థుల్లో వైకల్యాలను గుర్తించి ప్రశస్త్‌ యాప్‌లో నమోదు చేసే బాధ్యత హెచ్ఎంలతో పాటు ఆయా తరగతి ఉపాధ్యాయులపై ఉంటుందని సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం జిల్లా కోఆర్డినేటర్‌ పడకంటి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. పెర్కిట్‌లోని మోడల్‌ స్కూల్‌లో ఎంఈవో రాజగంగారాం ఆధ్వర్యంలో ఆర్మూర్, ఆలూర్‌ మండలాల ప్రధానోపాధ్యాయులకు ప్రశస్త్‌ యాప్‌ పై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థుల్లో గుర్తించిన వైకల్యాలను మదింపు చేయడానికి సమగ్ర శిక్ష, ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ప్రశస్త్‌ యాప్‌ను రూపొందించారన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రతి విద్యార్థిని పరిశీలించి రిపోర్టును యాప్‌లో పొందుపర్చాలన్నారు. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని స్పెషల్‌ టీచర్‌ రామకృష్ణ, ఐఈఆర్పీలు సునీల్, కిషన్, సురేష్‌ వివరించారు. సమావేశంలో ఆలూర్‌ ఎంఈవో నరేందర్, పెర్కిట్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఆర్మూర్, ఆలూర్‌ మండలాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు సంతోష్, లత పాల్గొన్నారు.