అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. శనివారం గిరిరాజ్‌ కళాశాల ప్రాంగణంలో అల్యూమిని అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిరాజ్‌ కళాశాల రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందని, విద్యార్థుల్లో అన్ని విధాలుగా నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కళాశాలలో 26 నూతన గదులతో కూడిన భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే న్యాక్‌ గుర్తింపు కోసం కళాశాల వెళ్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు రాజేందర్‌ రెడ్డి, కృపాకర్‌ రెడ్డి కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా చెరో రూ. 25 వేల ఆర్థిక సాయాన్ని సమన్వయకర్త దండు స్వామికి అందించారు. పూర్వ విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు రవీంద్రనాథ్‌, శ్రీనివాస్‌, తెలంగాణ శంకర్‌, హెల్పింగ్‌ హాండ్స్‌ తదితరులు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల వెబ్సైట్‌, సభ్యత్వం, ఆర్థిక సాయం కోసం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరించారు. సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు రాజేంద్ర సాగర్‌, నాగరాజు, వైస్‌ ప్రిన్సిపల్‌ అబ్దుల్‌ రఫీక్‌ రంగరత్నం, ఎన్సీసీ అధికారి రామస్వామి వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.