అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడో టౌన్ పరిధిలో గణేశ్(23) అనే వ్యక్తి తన అక్క బావతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా గొడవల కారణంగా భార్యతో దూరంగా ఉంటున్నాడు. ఈ విషయమై కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గణేశ్ తో మాట్లాడేందుకు శనివారం అతని బావమరిది నగరానికి వచ్చాడు. స్టేషన్ వద్ద గణేశ్ తో పాటు అతని బావమరిది, అక్క, బావ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అనంతరం బావమరిది మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు. అయితే సాయంత్రం సమయంలో స్టేషన్ వద్ద పట్టాలపై గణేశ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే మూడో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మృతుడి మెడకు తాడు వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.