అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారతదేశంలో గుండె సంబంధిత రోగులు అధికంగా పెరుగుతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం, ధూమపానం, వ్యాయామ లోపం వంటివి ప్రధానంగా ఈ సమస్యకు కారణం అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో వృద్ధులలోనే కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. గుండెపోటు పరిస్థితులకు దోహదపడే అనారోగ్యకరమైన ఆహారాలు, శారీరక నిష్క్రియాత్మకత, ధూమపానం వంటి ప్రమాద కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రతి సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తోంది.

ప్రధాన కారణాలివే..

  • అధిక కొవ్వు, పంచదార, ఉప్పు కలిగిన ఆహారపు అలవాట్లు, అలాగే ధూమపానం, మద్యం వాడకం గుండె వ్యాధులను ప్రోత్సహిస్తున్నాయి.
  • దేశంలో సుమారు 54 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
  • గుండె సంబంధిత వ్యాధులతో ప్రతి సంవత్సరం సుమారు 28 శాతం మంది మరణిస్తున్నారు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువ.

జాగ్రత్తలు పాటిస్తే మేలు

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణం. వాకింగ్, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి 30 నిమిషాల శారీరక శ్రమను ప్రతిరోజూ చేయాలని చెబుతున్నారు. ఇది గుండెను బలపరుస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. తద్వారా ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది.

సమతుల్య ఆహారం అవసరం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్, చక్కెర, అధిక కేలరీల ఆహారాన్ని నివారించండి. వీటికి బదులుగా.. ఆహారంలో బాదం, వాల్నట్స్, అవకాడో, క్యారెట్ వంటి పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఇవి గుండె సిరలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం

  • ఎక్కువ సేపు మెలకువగా ఉండడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితిలో తగినంత సమయం(7-8 గంటలు) నిద్రపోవాలి.
  • ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయాలి. ఇది శరీరం ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. ఇది గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒక్కసారి అయిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.