అక్షరటుడే, కామారెడ్డి: తనకు మంత్రి పదవిపై ఆశ లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో సోమవారం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని, తనకు మాత్రం ఆశ లేదన్నారు. గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన లైంగిక దాడి ఘటన బాధాకరమన్నారు. సమన్వయంగా వ్యవహరించిన ఎస్పీ సింధుశర్మ, పోలీసులను అభినందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలలో మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, గూడెం శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, మామిండ్ల అంజయ్య, గుడుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.