అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ మండలంలోని మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సోమవారం ఛైర్‌పర్సన్ కల్యాణి విఠల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సీఈవో సాయిలు జమ, ఖర్చుల నివేదికను చదివి వినిపించారు. సహకార సంఘంలో 1,091 మంది రైతులకు 225 మందికి రూ.70 లక్షల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని రైతులు పేర్కొన్నారు. తమ పేర్లు, ఆధార్ నెంబర్లు సక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతోనే రుణమాఫీ వర్తించలేదని కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మాఫీ వచ్చినప్పటికీ ఇంకా అప్పు అలాగే ఉంచారని మరికొందరు వాపోయారు. ప్రతి రైతుకు రూ.రెండు లక్షలలోపు రుణమాఫీని వర్తింప చేయాలంటూ తీర్మానించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రామ్ సింగ్, విఠల్ రెడ్డి, మనోహర్, శ్రీనివాస్, బాబుసేట్, జయేందర్ రెడ్డి అంజయ్య పాల్గొన్నారు.