అక్షరటుడే, ఇందూరు: విద్య, వైద్యం, వ్యవసాయశాఖలతో పాటు అన్ని శాఖల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెండో విడతలో టెక్నికల్ సమస్యతో కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. అతి త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం దున్నని పొలాలకు కూడా రుణమాఫీ చేసి ప్రభుత్వాన్ని అప్పుల్లో ముంచిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ప్రస్తుతం ఆలస్యం అవుతోందన్నారు. తమ ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి శాఖపై మార్పు కనిపించేలా పాలన ఉంటుందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి సారించి వాటి బలోపేతానికే కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో పాఠశాలలపై దృష్టి పెట్టాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.