అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: బీఆర్‌ఎస్‌ నేతలు తమ ఆస్తులను కాపాడుకునేందుకే హైడ్రాను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ బాధితులకు సంబంధించి పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. అప్పుల తెలంగాణ ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని విడతల వారీగా చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ధరణి వెబ్‌సైట్‌లో తప్పిదాల వల్లనే కొందరికి రుణమాఫీ నిలిచిపోయిందని చెప్పారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, టీపీసీసీ కార్యదర్శి నగేశ్ రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.