అక్షరటుడే, ఆర్మూర్: సోయా పంటకు ఎంఎస్పీపై రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పంటకు ఎంఎస్పీ రూ. 4800 ఉందన్నారు. వెంటనే బోనస్ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా సోయా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడి ఏర్పాటు చేసిందన్నారు. ఎకరాకు కేవలం 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తోందన్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని.. మిగిలిన పంటను రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. షరతులు లేకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా సమీక్ష సమావేశానికి శుక్రవారం మంత్రులు రానున్నారని.. కానీ తనకు అధికారులు ఈ రోజు ఉదయం సమాచారం ఇచ్చారన్నారు. సమావేశానికి రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారని.. ఇది దురదుష్ట్రకరమని పేర్కొన్నారు.