అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో మరో మెడికల్‌ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. డిచ్‌పల్లిలోని సీఎంసీ భవనంలో నూతన కాలేజీ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. శనివారం నగరంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2025 నాటికి మెడికల్‌ కాలేజీ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే జిల్లాను పారిశ్రామికంగా, వైద్యపరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నిజాంషుగర్స్‌ను తెరిపించేందుకు అధ్యయనం కొనసాగుతోందన్నారు. ఇచ్చిన మాటప్రకారం ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. నిజామాబాద్‌ను స్మార్ట్‌ సిటీ జాబితాలో ఉండాలని.. కానీ, కొందరి అసమర్థత వల్ల అవకాశం దక్కలేదన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్‌లా హైదరాబాద్‌ పరిస్థితి మారకూడదంటే మూసి ప్రక్షాళన చేయాల్సిందేనన్నారు. నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని చెప్పారు. మంత్రివర్గ విస్తర్ణలో జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు.