అక్షరటుడే, వెడ్ డెస్క్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. 76.2 కి.మీ.కు రూ. 24,269 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫోర్త్ సిటీ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు వేర్వేరుగా నివేదికలు ఇచ్చారు. ఈ నెల 7న డిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఖరారు కావడంతో.. ఆ పర్యటనకు ముందుగానే డీపీఆర్ లు కావాలని సీఎం కార్యాలయం కోరింది. దీంతో ఏడో తేదీ నాటికి డీపీఆర్ లను ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు సంస్థ అధికారులు తెలిపారు. సీఎంపీ ముసాయిదా సిద్ధం కావడంతో ఆ నివేదికను డీపీఆర్ కు జోడించి సర్కారుకు అందజేశారు. దీని ఆధారంగానే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టేలా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వ సాయంతో..
మెట్రో రైలు ప్రాజెక్టులను వేర్వేరు నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రెండోదశలో 18శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రం తన వాటాగా 30శాతం భరించేందుకు సిద్ధపడుతోంది. 4 శాతం పీపీపీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలనేది ఆలోచన చేస్తోంది. మిగిలిన 48 శాతానికి సంబంధించి జైకా వంటి సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య ప్రాజెక్టుపై రుణాలకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.
తొలుత మంత్రిమండలిలో చర్చించి..
మెట్రో రెండోదశ డీపీఆర్ ను తొలుత రాష్ట్ర మంత్రి మండలిలో చర్చించి ఆమోదించాలి. తదుపరి క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి మెట్రో రెండోదశకు ఆమోదం తెలపాలని కోరే అవకాశం ఉంది.
ఐదు మార్గాలు ఇవే..
- నాగోల్- శంషాబాద్ విమానాశ్రయం : 36.6 కి.మీ.
- రాయదుర్గం – కోకాపేట నియోపొలిస్ : 11.6 కి.మీ.
- ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట : 7.5 కి.మీ.
- మియాపూర్ – పటాన్చెరు : 13.4 కి.మీ.
- ఎల్బీనగర్- హయత్ నగర్ : 7.1 కి.మీ.