అక్షరటుడే, వెబ్ డెస్క్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/ వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో 80, ఆయుష్ 61, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 17న నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.