అక్షరటుడే, ఇందూరు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయామని.. దీనిపై పార్టీ ఆలోచన చేయాలని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సొంత పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ.. కేవలం 8 సీట్లకే పరిమితమైందన్నారు. ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చేలా పార్టీ ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.