అక్షరటుడే, ఇందూరు: రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధుకు ఇచ్చిన నిధులు సీఎం కార్యాలయం నుంచి విడుదల అయ్యాయని, వ్యవసాయ శాఖ నుంచి కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం దివాలా తీసిందన్నారు. కనీసం పాఠశాలలు, కళాశాలలకు అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టారని, అదే పరిస్థితి కాంగ్రెస్ కు కూడా వస్తుందన్నారు. మూసీ విషయంలో తాము అక్రమ కట్టడాలకు వ్యతిరేకమని, కానీ దాని విధి విధానాలు ఖరారు చేయలేదన్నారు. సీఎం గెలుపొందిన కొత్తలో రైతు రుణం అందకపోతే బ్యాంకు వెళ్లాలని సూచించారని గుర్తు చేశారు. కానీ అవన్నీ ఉత్తి మాటలేనన్నారు. అలాగే వితంతువులకు రూ. 4వేలు అందిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. గ్రూప్-1 విషయంలో రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని, జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా వాయిదా వేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అభ్యర్థులకు అండగా వెళ్లిన ఎంపీ బండి సంజయ్ ని అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము సభ్యత్వ నమోదు కోసం వెళితే గ్రామ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతిపత్రాలు సమర్పిస్తున్నారని చెప్పారు.
సభ్యత్వంలో ముందుండాలి
పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లా కార్యకర్తలు ముందుండాలని ఈటల సూచించారు. జిల్లాలో 7 లక్షల ఓట్లు వచ్చాయని, కనీసం అందులో సగమైన నమోదు చేయాలని కోరారు. సభ్యత్వ నమోదుపై స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆధారపడి ఉంటాయన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.