అక్షరటుడే, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు సర్కారుకు ప్రతిపాదనలు పంపించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1,200 కోట్ల మేర.. నష్టం భర్తీకి సర్కార్ అనుమతి కోరుతూ డిస్కంలు ప్రతిపాదనలు పంపించాయి. కాగా.. ఈ ప్రతిపాదనలపై భారాస తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు రెవిన్యూ లోటు భర్తీ చేసుకొనేందుకు ఛార్జీల పెంపు తప్పదని ఈఆర్సీకి నివేదికలు ఇచ్చాయి. ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో రూ. 13,222 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగతా రూ. 1,200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.

రెండు కేటగిరీల్లో..

డిస్కం లు హైటెన్షన్ కేటగిరీ విద్యుత్ ఛార్జీల పెంపు, లోటెన్షన్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రతిపాదలు పంపించటం గమనార్హం. హైటెన్షన్ కేటగిరీకి ఛార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఇదిలా ఉంటే.. మరో రూ.400 కోట్లను లోటెన్షన్ కేటగిరి విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్‌ ఛార్జీల పెంపుతో రాబట్టుకోనున్నట్టు ప్రతిపాదనల్లో డిస్కంలు పేర్కొన్నాయి.

300 యూనిట్లు దాటితే..

రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం కోటీ 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా.. వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు. మిగతావారు ఆపై వాడుతున్నారు. నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం 10 వసూలు చేస్తుండగా.. 50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి.

సామాన్యుడు ఇక విలవిలే..

డిస్కంలు ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలను రేవంత్ రెడ్డి ఆమోదిస్తే.. విద్యుత్ ఛార్జీలు పెరిగి.. సామాన్యుల జేబులు ఖాళీ కాక తప్పదు. అసలే పెరిగిన నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేక అల్లాడుతున్న ప్రజలకు ఈ విద్యుత్ చార్జీల పెంపు మరింత భారంగా మారనుంది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రతిపక్ష భారాస నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.