యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే : సీఎం రేవంత్‌

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : యూనివర్సిటీలకు కొత్తగా నియమితులైన వీసీలు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈరోజు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునర్ధురించాలని సూచించారు. ఎవరి ప్రభావితంతోను వీసీ పోస్టులకు ఎంపిక జరగలేదని, మెరిట్‌ సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక జరిగిందని మీరు బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై విశ్వాసం సన్నగిల్లిందని, తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలని సూచించారు. గతంలో యూనివర్సిటీ వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు ఇప్పడు ఆపరిస్థితిలేదన్నారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు ప్రారంభించాలని, కన్సల్టెన్సీలను నియమించుకొని నివేదిక తయారు చేసుకోవాలని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని వివరించారు. మంచి పని చేయడానికి వీసీలకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ సహకారం ఉంటుందని, తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్‌, గంజాయి విక్రయాలపై దృష్టి సారించాలని, అటువంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ. బాలకృష్ణ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం , వివిధ యూనివర్సిటీల నూతన వీసీలు ఉన్నారు.