అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కులగణన కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో విబేధాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికలకు ముందు నుంచే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలకు మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి పాల్గొన్న కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరవడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే శనివారం నిర్వహించిన కులగణన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఒకే వేదికపై ఆసీనులయ్యారు. అయితే మదన్ మోహన్ రావు, షబ్బీర్ అలీ పేర్లు వేదికపై ఉన్న నాయకులు పలికినప్పుడల్లా ఆయా నాయకుల కార్యకర్తలు పోటాపోటీగా ఈలలు, కేకలతో ఆడిటోరియం దద్దరిల్లడం గమనార్హం. నేతల మధ్య విభేదాలున్నా ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాగే కలిసి పాల్గొంటే కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంటుందనే మాటలు పలువురి నోట వినిపించాయి.