అక్షరటుడే, ఇందూరు: చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కూడుకొని ఉండే మాసం కార్తీకం.. పరమేశ్వరుడు, శ్రీ మహా విష్ణువుల ఆరాధనకు ప్రీతికరమైనది ఈ మాసం. అందుకే ఈ నెలలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంకుస్థాపనలు, నామకరణ, అన్నప్రాశన వంటి శుభకార్యాలు తలపెట్టడం శ్రేయోదాయకంగా భావిస్తారు.
ముహూర్తాలు ఇవే..
కార్తీక మాసం మొదలు కావడంతో ఇప్పటికే పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబర్ 3, 6, 14, 15, 22, 28, 30 వ తేదీల్లో ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధిక సంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
పురోహితులు బిజీ..
కార్తీక మాసం కావడంతో నిత్య పూజలతో పురోహితులు ఇప్పటికే బిజీగా ఉన్నారు. దీనికి తోడు శుభకార్యాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లతో వారికి మరింత తీరిక లేకుండా పోయింది. కార్తీకమాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే పౌర్ణమి నాడు చాలామంది సత్యనారాయణ వ్రతాలు, తులసీ లగ్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజున పూజలు చేసేందుకు పురోహితులను ఇప్పటినుంచి ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు.
జోరుగా పూల వ్యాపారం..
అత్యంత పవిత్రమైన మాసంగా పేరుకునే ఈ కార్తీకంలో నిత్య పూజలు కొనసాగుతూ ఉండడంతో.. పూల వ్యాపారం జోరుగా సాగుతోంది. పెళ్లి పందిళ్ల అలంకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు మండలపాలకు ప్రాధాన్యత రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహాలకే పూల వ్యాపారులు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. సాధారణ విక్రయాలను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో విడిగా పరిస్థితి లేకుండా పోయింది. దొరికిన చోట ధరలు అధికంగా ఉంటున్నాయి. బంతిపూలు కిలో రూ. 60 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు. చామంతి అయితే 50 గ్రాములకు రూ. 30 వరకు తీసుకుంటున్నారు. ఇక గులాబీ పూలు సరేసరి. 50 గ్రాములకు రూ. 50 వసూలు చేస్తున్నారు.
క్యాటరింగ్ వ్యాపారాలు..
వివాహాల నేపథ్యంలో క్యాటరింగ్ వ్యాపారం జోరు అందుకుంది. మెనూలో ఆహార పదార్థాల సంఖ్య పెరుగుతూ పోతోంది. పెళ్లికి వచ్చే బంధు మిత్రుల కడుపు నింపేందుకు తమ తాహతుకు మించి 5 నుంచి 20 రకాల ఆహార పదార్థాలను ఎంపిక చేసుకుంటూ.. పెళ్లి బడ్జెట్ను లక్షల రూపాయలకు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా క్యాటరింగ్ వారు ఒక్కో ప్లేట్ ధర ను రూ.200 నుంచి రూ. 500 వరకు నిర్ణయిస్తున్నారు.
ఫొటో, వీడియో షూటింగ్..
పెళ్లిళ్లలో నేపథ్యంలో ఇప్పటికే చాలా జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. పెళ్లిళ్లలో ఫొటో, వీడియో షూటింగ్ లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వీడియో గ్రాఫర్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో పెళ్లి చిత్రీకరణకు రూ. 50వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తుండడం గమనార్హం.